Get Mystery Box with random crypto!

దేశానికి అన్నంపెట్టే రైతులు చట్టసభల్లోకి ఎందుకు వెళ్లకూడదు? అన | TRS Party

దేశానికి అన్నంపెట్టే రైతులు చట్టసభల్లోకి ఎందుకు వెళ్లకూడదు? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.

రాజకీయాల్లో రైతు నేతలు భాగస్వాములు కావాలి..
-----------------------------------------------
రాజకీయాలంటే అయోమయం అవసరం లేదు. మొహమాటాల నుంచి రైతు నేతలు బయటపడి రాజకీయాలనే పవిత్ర యజ్ఞంలో భాగస్వాములై, దేశ రైతాంగ సమస్యల పరిష్కారానికి పాటుపడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆయా సందర్భాలను బట్టి, నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట కార్యాచరణను అనుసరిస్తూ, అవసరమైన చోట ఉద్యమ పంథాను కూడా కొనసాగిస్తూ సాగే, ప్రజాస్వామిక పార్లమెంటరీ పంథా ద్వారా మాత్రమే ప్రజాస్వామిక దేశాల్లో ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందన్నారు. అందుకు తెలంగాణ రాష్ట్ర సాధనే నిదర్శనమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు.

‘‘ఎక్కడ ఆందోళన అవసరమైతదో అక్కడ ఆందోళన చేద్దాం – ఎక్కడ రాజకీయాలు అవసరమైతయో అక్కడ రాజకీయాలు చేద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. మన శక్తిని మనం గుర్తించడంలో వెనుకబడి ఉన్నాం. రాజకీయాల్లో ఉండటం అపవిత్రం అనుకోవడం సరికాదు.’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

జాతీయస్థాయిలో ఐక్య సంఘటనను నిర్మిద్దాం..
---------------------------------------------
‘‘ఈ సమావేశంలో పాల్గొన్న రైతు సంఘాల నాయకులందరూ మీ మీ ప్రాంతాలకు చేరుకొని, మనం తీసుకున్న నిర్ణయాలను, అంశాలను మీ సంఘాల నేతలు, రైతులతో చర్చించండి. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోండి. మరికొద్ది రోజుల్లో మరోసారి సమావేశమవుదాం. జాతీయస్థాయిలో ఐక్య సంఘటనను నిర్మిద్దాం. దేశవ్యాప్తంగా గ్రామగ్రామానికి చేరుకునేలా రైతుల ఐక్యత చాటుదాం. దేశం నలుమూలల నుంచి రైతుల డిమాండ్లను విందాం. జాతీయస్థాయిలో వ్యవసాయ రంగానికి చెందిన శాస్త్రవేత్తలను, ఆర్థికవేత్తలను, పలు రంగాలకు చెందిన మేధావులను, జర్నలిస్టులను పిలిచి, వారందరితో లోతైన చర్చలు, విశ్లేషణలు చేద్దాం. ఆ సమావేశంలో దేశ రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని సమస్యల నుంచి కాపాడుకునేందుకు అనుసరించాల్సిన విధి విధానాలను, కార్యాచరణ బ్లూ ప్రింట్ ను సిద్ధం చేసుకుందాం. రాష్ట్ర, జిల్లా, తాలూకా, గ్రామస్థాయిలో ఫెడరల్ స్ఫూర్తితో సంఘ నిర్మాణాలు చేద్దాం. రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిద్దాం. తెలంగాణ సాధన కోసం సాగిన భావజాల వ్యాప్తిలాగా, రైతుల సమస్యల పరిష్కార సాధన కోసం కావాల్సిన భావజాలాన్ని దేశంలోని అన్ని గ్రామాల్లో వ్యాప్తి చేద్దాం.. అని సీఎం కేసీఆర్ అన్నారు.

‘అవ్వల్ దర్జా కిసాన్’ లను తయారు చేద్దాం..
----------------------------------------
"నేను స్వయానా ఒక రైతును. రైతు కష్టాలు నాకు తెలుసు. వాటిని పరిష్కరించం ఎట్లనో కూడా తెలుసు. ఢిల్లీ, హైదరాబాద్ సహా, ఉత్తర, దక్షిణ భారత దేశాలను అనుసంధానించేందుకు రైతు కార్యాలయాలను ఏర్పాటు చేసుకుందాం. ఒక సామాన్య రైతు కూడా దేశ ప్రధానితో ధీటుగా చర్చించే విధంగా వారిని తీర్చిదిద్దుదాం. రైతాంగం కోసం ఏకరీతి ఎజెండాతో ఒకేసారి పోరాటాన్ని ప్రారంభిద్దాం. దేశ రైతును ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరిగే ‘అవ్వల్ దర్జా కిసాన్’ గా తయారు చేద్దాం’’ అని సీఎం కేసీఆర్ రైతు సంఘాల నేతలకు పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్ అనుసరించిన మార్గంలోనే నడుద్దాం..
------------------------------------------------
ఈ సందర్భంగా పంజాబ్, ఉత్తర ప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు చెందిన సీనియర్ రైతులు మాట్లాడుతూ ‘‘మనం ఇన్నాళ్లూ రైతు సమస్యల పరిష్కారానికి కేవలం ఆందోళనలు, ఉద్యమాలే శరణ్యం అనుకొని మన జీవితాలను మార్చే రాజకీయాలను విస్మరించాం. ఇకనుంచి సీఎం కేసీఆర్ అనుసరించిన మార్గంలోనే కలిసి నడుద్దాం. ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి, దేశ రైతాంగ సమస్యలకు పరిష్కారాలను సాధించుకుందాం’’ అని దేశ రైతాంగానికి పిలుపునిచ్చారు.

దేశ రైతు ఒక్క ఎకరం భూమి కూడా కోల్పోవద్దు..
-----------------------------------------------
నూతన వ్యవసాయ చట్టాల పేరుతో, కరంటు మోటార్లకు మీటర్లు పెట్టి, రవాణా చార్జీలను పెంచి, ధాన్యం కొనుగోళ్లను నిలిపివేస్తూ, రైతు పంటల ఎగుమతులు, దిగుమతుల్లో అసంబద్ధ విధానాలను అవలంభిస్తూ, కేంద్ర ప్రభుత్వం అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నదని సమావేశం అభిప్రాయపడింది. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి, సన్నకారు రైతుల నోళ్లు కొట్టి, కార్పొరేట్ గద్దలకు దేశీ వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పేందుకు కుట్ర జరుగుతున్నదని, దీన్ని తిప్పికొట్టాలని, ఒక్క ఎకరం కూడా దేశ రైతు తన భూమిని కోల్పోకుండా కాపాడుకుంటాం.. అని సమావేశం తీర్మానం చేసింది. రైతు పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని నమ్మబలుకుతూ.. మండీలను ఖతం చేయాలనే కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టి, దేశ ప్రధాని నరేంద్ర మోడీతో స్వయంగా క్షమాపణలు చెప్పించిన ఘనత భారత దేశ రైతాంగానికి చెందుతుందని పంజాబ్ కు చెందిన సీనియర్ రైతులు ఈ సందర్భంగా అభిప్రాయ పడ్డారు.