Get Mystery Box with random crypto!

తెలంగాణ వ్యతిరేకులతో నాడు 'జై తెలంగాణ' నినాదాన్ని అనిపించినట్ట | TRS Party

తెలంగాణ వ్యతిరేకులతో నాడు 'జై తెలంగాణ' నినాదాన్ని అనిపించినట్టే.. నేడు రైతు వ్యతిరేకులతో 'జై కిసాన్' నినాదాన్ని పలికించాలన్నారు. ఆ దిశగా దేశంలోని రైతు నేతలంతా ఐక్య సంఘటన కట్టి, ప్రతినబూనాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి అన్నారు. ఈ దేశ రైతుకు వ్యవసాయం ఒక జీవన విధానం అని, రైతు బాగుంటేనే వ్యవసాయం బాగుంటదని, వ్యవసాయం బాగుంటేనే సమాజం బాగు పడతదని సీఎం అన్నారు. ఈ దేశంలో రైతు మర్యాదను నిలబెట్టి, ఆత్మ గౌరవం కాపాడేందుకు కలిసి పనిచేద్దామని. జాతీయ రైతు నేతలకు సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.

వజ్రోత్సవ భారతంలోనూ.. అపరిష్కృత రైతాంగ సమస్యలెన్నో...
--------------------------------------------------------------
దేశంలో దశాబ్దాల కాలం నుంచి రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ సమస్యలకు వజ్రోత్సవ స్వతంత్ర భారతంలో ఇంకా పరిష్కారాలు దొరకకపోవడం దురదృష్ణకరమన్నారు. దేశాన్నేలుతున్న కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక అసంబద్ద విధానాలను తిప్పికొట్టి వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని ఆదివారం నాటి జాతీయ రైతు సంఘాల సమావేశం స్పష్టం చేసింది. దేశ రైతాంగాన్ని గ్రామస్థాయి నుంచి ఐక్యం చేసేందుకు నాయకత్వం వహించాలని సీఎంను సమావేశం ముక్తకంఠంతో కోరుతూ తీర్మానించింది. ఆదివారం నాడు జాతీయ సంఘాల నేతలతో ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రెండో రోజు సమావేశం జరిగింది. జాతీయ స్థాయిలో రైతుల ఐక్య వేదిక ఏర్పాటు చేయాలని శనివారం నాటి తీర్మానాన్ని అనుసరించి చర్చ కొనసాగింది. త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి, విధి విధానాలను రూపొందించాలని సమావేశం తీర్మానించింది.

వ్యవసాయ రంగ సమస్యలు – పరిష్కారాలపై సుదీర్ఘ చర్చ
------------------------------------------------------
ఈ సందర్భంగా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాల వల్ల భవిష్యత్ దేశీయ వ్యవసాయ రంగం కునారిల్లిపోనున్న ప్రమాదకర పరిస్థితుల్లో ఈ సమస్యలకు కారణాలు, వాటి పరిష్కార మార్గాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలు రాష్ట్రాలకు చెందిన జాతీయ రైతు సంఘాల నేతలు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు. స్వాతంత్ర్య కాలం నుంచి నేటి వరకూ దేశంలో జరిగిన రైతాంగ పోరాటాలను, అందుకు నాయకత్వం వహించిన నేతలు, వారు అవలంభించిన విధానాలు, పోరాట రూపాలను చర్చించారు. నాటి వ్యవసాయ పరిస్థితులకు, మారిన నేటి పరిస్థితులకు అవలంభించాల్సిన ఉద్యమ కార్యాచరణ విధి విధానాలను, పోరాట రూపాల బ్లూ ప్రింట్ ను తయారు చేసి దేశ రైతాంగాన్ని సంఘటితం చేసే దిశగా చర్యలు ప్రారంభించాలని, అందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేయాలని, సీఎం కేసీఆర్ ను కోరుతూ సమావేశంలో సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

జట్టుకట్టి, పట్టు పడితే.. సాధించలేనిది ఏమీ లేదు...
------------------------------------------------
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘‘వ్యవసాయం ఈ దేశ ప్రజల జీవన విధానమని, వ్యవసాయాన్ని ఈ దేశం నుంచి ఎవరూ వేరు చేయలేరు. రైతన్నలో శక్తి గొప్ప శక్తి దాగి ఉంటది. దాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉన్నది. మన సమస్యలకు పరిష్కారాన్ని మనమే అన్వేషించాలి. జట్టు కట్టి పట్టు పడితే సాధించలేనిది ఏమీ లేదని నేను స్వయంగా ప్రారంభించిన తెలంగాణ ఉద్యమం, లక్ష్యాన్ని సాధించి రుజువు చేసింది. నాకంటే ముందు తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. కాని, నిర్దిష్ట పరిస్థితులకు అనుసరించాల్సిన నిర్దిష్ట కార్యాచరణ కొరవడటంతో ఆనాడు లక్ష్యం నెరవేరలేదు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందు పలు రంగాలకు చెందిన మేధావులతో కొన్ని వేల గంటల మేధో మధనం చేసిన. తెలంగాణ పోరాటాలు విఫలం చెందడానికి కారణాలను అన్వేషించిన. ఆఖరి పోరాటం ఆగం కాకూడదనే దృఢ సంకల్పంతో, మొహమాటాలకు, బేషజాలకు తావు లేకుండా అటు రాజకీయ పంథాకు,ఇటు ఉద్యమ పంథాను సమన్వయం చేసుకుంటూ జమిలి పోరాటాలతో ముందుకు సాగాలనే తుది నిర్ణయం తీసుకోవడం ద్వారా గమ్యాన్ని ముద్దాడినం.’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

శాంతియుత పంథాలో పార్లమెంటరీ పోరాటం చేద్దాం..
-----------------------------------------------
‘‘ఆనాడు తెలంగాణ ప్రజలను ఇంటింటికీ ఒక యువకుడిని పంపమని అడిగిన. ఓటు వేయడం ద్వారా తమ శక్తిని చాటే పార్లమెంటరీ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన. వివిధ ఉద్యమ రూపాల ద్వారా ప్రజలను చైతన్య పరిచినం. ఓటు అనే ఆయుధాన్ని ప్రజా ఆకాంక్షలకు ప్రతిరూపంగా మార్చి లక్ష్యాన్ని చేరుకోగలిగాం. రాజకీయాలతో అయితదా? అని నన్ను అడిగిండ్రు. కానీ, వారి అనుమానాలను పటా పంచలు చేస్తూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నిజం చేసి చూపించిన’’ అని సీఎం అన్నారు. రాజకీయ నిర్ణయాల ద్వారానే ప్రజా జీవితాలు ప్రభావితమవుతాయని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకు అసెంబ్లీలు, పార్లమెంటులే వేదికలన్నారు. కేవలం ఉద్యమాలు, ఆందోళనల పేరుతో చట్టసభలకు దూరంగా జరిగే పోరాటాలు సఫలీకృతం అయిన చరిత్ర స్వతంత్ర భారతంలో కనిపించదన్నారు. రాజకీయాలు చేయడం అంటే నామోషీ అని భావించడం తప్పు అని సీఎం కేసీఆర్ అన్నారు.